6, ఫిబ్రవరి 2012, సోమవారం

 ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం
44 మంది మృతి
  • రిక్టర్ స్కేల్పై 6.9గా తీవ్రత నమోదు
  • సునామీ హెచ్చరిక జారీ, ఉపసంహరణ
మనీలా: ఫిలిప్పీన్స్ మధ్య తీరప్రాంతాన్ని సోమవారం ఉదయం శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. 44 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. పలుచోట్ల భవనాలు కుప్పకూలాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లనుంచి వీధుల్లోకి పరుగులుతీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. దేశంలో మూడో అతిపెద్ద ద్వీపమైన నెగ్రోస్ ఓరియంటల్ ద్వీపంలోని డమాగెట్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. ఇది సముద్రంలో 46.6 కిలోమీటర్ల దిగువన సంభవించింది. నె గ్రోస్లో 44 మంది చనిపోయారని, పలు రోడ్లు నెర్రెలువారాయని, వంతెనలు ధ్వంసమయ్యాయని అధికారులు చెప్పారు. నెగ్రోస్, సెబులాన్, బకోలాడ్ తదితర ప్రాంతాల్లో పలు భవనాలు కుప్పకూలాయని, ఇంకొన్ని భవనాలు  కంపించాయని, విద్యుత్ సర ఫరా నిలిచిపోయిందని వెల్లడించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు చేపడుతున్నామన్నారు. ఫిలిప్పీన్స్ అగ్నిపర్వతాల, భూకంప అధ్యయనాల సంస్థ నీగ్రోస్, సెబూ ద్వీపాల మధ్య ఉన్న టానానస్ జలసంధి పరిసర ప్రాంతాల్లో రెండో నంబర్ సునామీ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. తర్వాత పరిస్థితిని సమీక్షించి ఉపసంహరించుకుంది. సునామీ ముంచెత్తనుందని తెలియడంతో డమాగట్, సిబులాన్, వాలెన్సియాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సహాయ సిబ్బంది వందలాది మందిని ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. సెబూ హోటళ్లలో బసచేసిన అతిథులు భయాందోళనతో పై అంతస్తుల్లోకి చేరారు. భూకంపం వల్ల పాఠశాల గోడలు కూలడంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోయారని పౌరభద్రతా విభాగం చీఫ్ బేనిటో రామోస్ చెప్పారు. డమాగట్, సిబూలాన్లో ప్రధాన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7గా, టాంజాయ్ నగరంలో 8గా నమోదైంది.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి