8, ఫిబ్రవరి 2012, బుధవారం

వెనక్కి తగ్గిన డిఎల్
శాఖల మార్పిడిపై అసంతృప్తితో తాను రాజీనామా చేసే వ్యక్తిని కాదని, శాఖ కోత పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, అయితే వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. 1978లోనే తనది స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చరిత్ర అన్నారు. తర్వాత తాను కాంగ్రెసు పార్టీలో చేరి ఇంత ఉన్నత స్థానానికి చేరుకున్నానని అన్నారు. తనను స్థాయికి తీసుకు వచ్చిన పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయాలని తాను భావించలేదన్నారు. పార్టీకి తాను నిబద్ధత కలిగిన కార్యకర్తను అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాను ఎప్పుడూ మంత్రి పదవి కావాలని అడగలేదన్నారు. వారే పదవి ఇచ్చారన్నారు. శాఖల కేటాయింపులపై నిర్ణయం ముఖ్యమంత్రిదేనని చెప్పారు. తాను పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదన్నారు. శాఖ మీద అసంతృప్తితో తాను రాజీనామా చేసే వ్యక్తిని కాదన్నారు. తనకు శాఖను తగ్గించిన దానికంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే బాధించాయన్నారు. తన తండ్రి వైయస్సార్ రెక్కల కష్టంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పాలిస్తుందని జగన్ వ్యాఖ్యానించారని, వాటి పట్ల తాను చాలా ఆవేదన చెందానన్నారు. ఆయన వ్యాఖ్యలు ఎవరూ ఖండించక పోవడం బాధాకరమన్నారు. కార్యకర్తల రెక్కల కష్టం మీద మాత్రమే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందన్నారు.
అంతకుముందు డిఎల్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆయనకు పలుమార్లు ఫోన్ చేసి రాజీనామా చేయవద్దని నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. పిసిసి చీఫ్ బొత్స, ఆజాద్లు బుజ్జగించడంతోనే ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా డిఎల్కు ఫోన్ చేసి బుజ్జగించారని సమాచారం.
---------------------------------------------------------------------
 -బొత్సకు గురిపెడితే మోపిదేవికి...
మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడుల వ్యవహారం మిస్ ఫైర్ అయినట్లు కనిపిస్తోంది. ఎసిబి దాడులను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు గురిపెట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తన మీద పైచేయి సాధించడానికి బొత్స సత్యనారాయణను దెబ్బ తీయడానికి ముఖ్యమంత్రి ఎసిబి దాడుల వ్యవహారాన్ని, ఎసిబి అందించిన నివేదికను అస్త్రంగా వాడాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ముఖ్యమంత్రి టార్గెట్ గురి తప్పినట్లు భావిస్తున్నారు. అది కాస్తా ఆబ్కారీ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణను తాకింది. ఎసిబి విస్తృతంగా మద్యం సిండికేట్లపై దాడులు చేస్తూ సిండికేట్ వ్యాపారులను ఆరెస్టు చేస్తోంది. ఎవరెవరికి లంచాలు అందాయనే విషయాలను కూడా సేకరించి జాబితా రూపొందించింది నున్నా వెంకటరమణ అనే సిండికేట్ వ్యాపారి అరెస్టు సంచలనం రేపింది.
ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లు ఎసిబి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మోపిదేవి వెంకటరమణ ఆత్మరక్షణలో పడ్డారు. బొత్స సత్యనారాయణ క్షేమంగా బయటి పడి మోపిదేవి ఇరుకున్నారనే అభిప్రాయం బలపడుతోంది 
 ---------------------------------------------------------------------
జైలులో.. శ్రీలక్ష్మి వైరాగ్యం..!
ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైలులో పూర్తి వైరాగ్యంతో ఉన్నారు . చంచల్గూడ మహిళా జైలులో ఉన్న ఆమె ఖైదీల పట్ల, జైలు అధికారుల పట్ల సాధారణ పౌరురాలిలా మసలుకుంటున్నారుఆమె జైలు జీవితం నెల రోజులు పూర్తయింది. గత జనవరి 6 తేదిన కోర్టు ఆమె బెయిల్ను రద్దు చేయడంతో సిబిఐ ఎదుట లొంగిపోయారుఆమెను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని జనవరి 25 కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఆమె అలాంటి ప్రత్యేక అధికారాలు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. జైలు అధికారుల్లో తన కన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారిని శ్రీలక్ష్మి అమ్మా అని సంభోదిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేకంగా తనకు ఇష్టమైన వంట చేయించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆమె దానిని ఉపయోగించుకోవడం లేదు. అంతకుముందు ఆమె జైలుకు వచ్చినప్పటికీ, ఇప్పటికీ తేడా కనిపిస్తోందట. అంతేకాదు తన భర్త, ఐపిఎస్ అధికారి గోపి కృష్ణను తప్ప ఆమె ఎవరిని కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఆమె భర్త ఆమెకు జైలులో చదువుకునేందుకు పుస్తకాలు, తినేందుకు పళ్లు తీసుకు వస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం వారంలో రెండు సార్లు మాత్రమే కలిసేందుకు అవకాశముంది.జైలులో ఆమె సాధారణంగా ఉండటం చూస్తుంటే నిర్వేదంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 
  ---------------------------------------------------------------------
కాలు జారిన జయప్రద.., కింద పడిన గడ్కరీ
సినీ హీరోయిన్ జయప్రద కాలుజారి  తూలి పడ్డారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మాజీ సమాజ్వాది పార్టీ నేత అమర్సింగ్ ఏర్పాటు చేసిన లోక్మంచ్ పార్టీ తరఫున ప్రచారం ఆమె చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆమె సఖోపర్ గ్రామంలో ఒక సభలో మాట్లాడటానికి వెళ్లారు. సమయంలో ఆమె వేదిక దగ్గరికి వెళుతూ  కాలుజారి కింద పడిపోయారు. ఆమె కు ఎలాంటి గాయాలు కాలేదు.మరోచోట భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి ప్రమాదం తప్పింది. ఆయన యుపి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మహమ్మదాబాద్ నియోజకవర్గంలోని రఘువర్గంజ్లో ఏర్పాటైన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు వేదికపై కూర్చున్నారు. అయితే వేదిక పైకి ఎక్కువ మంది రావడంతో బరువు తట్టుకోలేక కూలిపోయింది. ఘటనలో గడ్కరీతో పాటు మిగిలిన నేతలు అందరూ కిందపడ్డారు. అయితే గడ్కరీతో సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
-------------------------------------------------------- 
 
 పవన్ సరసన.. కాజల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా రూపొంద బోతున్న విషయం తెలిసిందే. మే నెల నుంచి చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రంలో కాజల్అగర్వాల్ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గబ్బర్ సింగ్ చిత్రంతోనే కాజల్ పవన్ కళ్యాణ్ సరసన నటించాల్సి ఉంది. అయితే అప్పుడు డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. పూరి పుణ్యమా అని మహేష్ బాబుతో కలిసి నటించాలనే తన కోరిక నెరవేచ్చుకున్న  కాజల్... తాజాగా పూరి మూలంగానే పవన్ స్టార్తో ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మే నెల నంచి పవన్-పూరి సినిమా సెట్స్ పైకి రానుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి